శ్రీకాకుళం, మే 25 :
'పుత్రుడు పున్నామ
నరకం నుంచి
తప్పిస్తాడని ఏ
తండ్రయినా ఆశపడతాడు..
కానీ, ప్రజలందరితో
నీరాజనాలు అందుకున్న
నీ తండ్రితో చేయరాని
పనులు చేయించి పాపాల
భైరవుడ్ని చేశావ్..
ఆయన్ను నిందితుడ్ని
చేశావ్.. నేరస్థుడ్ని
చేశావ్.. చివరకు ఆయన
మరణించాక రాష్ట్రమంతటా
విషాద ఛాయలు
అలుముకుంటే.. ఆయన
పార్థ్ధివ శరీరం
ఉండగానే ముఖ్యమంత్రి
పదవి కోసం సంతకాల
సేకరణ జరిపించావ్..
తండ్రి అధికారాన్ని
అడ్డుపెట్టుకొని లక్ష
కోట్ల రూపాయలు
అక్రమార్జన చేసావ్..
నీ స్వార్ధానికి
అధికారులు, మంత్రులు
జైలు పాలవుతుంటే
కులాసాగా చూస్తున్నావ్..
నీ తండ్రికి
బద్ధశత్రువైన
చంద్రబాబుతో చేతులు
కలిపి ప్రభుత్వాన్ని
కూలదోయాలని కుట్ర
చేశావ్.. ఇదంతా
చూస్తుంటే నీలాంటి
కొడుకు పుట్టకూడదని
ఇప్పుడు ప్రతి తండ్రి
కోరుకునే పరిస్థితి
ఏర్పడింది.. నీవు
చేసిన నీతిమాలిన
పనులతో నీ తండ్రి
ఆత్మ కూడా క్షోభించే
ఉంటుంది..' అని జగన్‌పై
కాంగ్రెస్ ముఖ్యనేత,
ఎంపీ చిరంజీవి
నిప్పులు చెరిగారు.
శుక్రవారం శ్రీకాకుళం
జిల్లా నరసన్నపేట
కాంగ్రెస్ అభ్యర్థి
రాందాస్ నామినేషన్
కార్యక్రమానికి
చిరంజీవి హాజరయ్యారు.
ఈ సందర్భంగా రోడ్‌షో
నిర్వహించారు. ఈ
సందర్భంగా మాట్లాడుతూ
రాష్ట్రంలో అశాంతి,
అనిశ్చితి
వాతావరణానికి జగనే
కారణమని దుయ్యబట్టారు.
వైఎస్ ప్రవేశపెట్టిన
ఏ పథకం ఆగిపోయిందో
చెప్పాలని జగన్‌కు
సవాల్ విసిరారు.
గ్రామగ్రామానా
పర్యటించి జగన్
నిజస్వరూపాన్ని
ఎండగడతానని
ప్రకటించారు. జగన్
ఊచలు లెక్కబెట్టేరోజు
ఎంతో దూరంలో లేదని
చిరంజీవి ధ్వజమెత్తారు.
నీ దృష్టిలో సీఎం
పదవంటే అక్రమాలకు
రక్షణ కవచమా అని
నిలదీశారు. కాంగ్రెస్
ఆయన కుటుంబానికి
అన్యాయం చేసిందని జగన్
ఏ ముఖం పెట్టుకుని
చెబుతున్నారని
చిరంజీవి ప్రశ్నించారు.
నీ తండ్రికి, నీ
బాబాయ్‌కు, నీకు ఇలా
నీ కుటుంబానికంతటికీ
పదవులు ఇచ్చి
గౌరవించడమే కాంగ్రెస్
చేసిన పాపమా అని
ప్రశ్నించారు.
ప్రజాస్వామ్య
విరుద్ధంగా ప్రభుత్వ
పాలనను వన్‌మ్యాన్
షోగా మార్చిన ఘనత
దివంగత ముఖ్యమంత్రి
వైఎస్
రాజశేఖరరెడ్డిదేనని
చిరంజీవివ్యాఖ్యానించారు.
విశాఖ విమానాశ్రయంలో
ఆయన విలేకరులతో
మాట్లాడారు.